Friday, 19 August 2016

మిస్టరీగా సుబ్బిరెడ్డి మరణం!

ప్రొద్దుటూరు: ప్రొద్దుటూరుకు చెందిన అభయ్‌ సేవా సమితి అధ్యక్షుడు కొనిరెడ్డి సుబ్బిరెడ్డి మరణం మిస్టరీగా మారింది. నాలుగు రోజుల క్రితం ప్రొద్దుటూరు శివారులోని బైపాస్‌రోడ్డులో అనుమానాస్పద స్థితిలో తీవ్ర గాయాలతో పడి ఉన్న సుబ్బిరెడ్డిని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బుధవారం అర్థరాత్రి సమయంలో అక్కడ మృతి చెందారు. కాగా కేసు నమోదులో జాప్యం కావడంతో పోస్టుమార్టం శుక్రవారానికి వాయిదా పడింది. పోస్టుమార్టం అనంతరం శుక్రవారం మధ్యాహ్నం సుబ్బిరెడ్డి మృతదేహాన్ని ప్రొద్దుటూరులోని భగత్‌సింగ్‌ కాలనీకి తీసుకురానున్నారు. అభయ్‌ సేవా సమితి పేరుతో స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసిన సుబ్బిరెడ్డి చాలా కాలంగా ప్రజలకు పలు రకాల సేవలు అందిస్తున్నారు. కుట్టుమిషన్‌ శిక్షణా కేంద్రాలు నిర్వహించడంతోపాటు, వేసవిలో తాగునీటిని కూడా సరఫరా చేసి అందరి మన్ననలు పొందారు. ఈ ఏడాది వేసవిలో కూడా అనేక చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేశారు. స్థానికలతోపాటు పలువురు అధికారులు, నేతలు ఆయన సేవలను ప్రశంసించేవారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో సుబ్బిరెడ్డి రాత్రి వేళలో పట్టణ శివారులో పడివున్న విషయం సంచలనం కలిగించింది. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగిందా, లేక ఎవరైనా ఉద్దేశపూర్వకంగా దాడిచేశారా అన్న విషయంపై అనేక అనుమానాలు ఉన్నాయి. వాటర్‌ ట్యాంకర్‌ కలిగిన ఓ యువకుడు తన వాహనంతో ఢీకొట్టి ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేసి ఉంటాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రెండోమారు ఫిర్యాదు చేసిన భార్య
  సుబ్బిరెడ్డి భార్య గురుపద్మ గురువారం ఉదయమే తిరుపతిలో జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను చెప్పినదానికి, ప్రొద్దుటూరు నుంచి ఆన్‌లైన్‌లో వచ్చిన ఎఫ్‌ఐఆర్‌ నమోదులో తేడా ఉండటంతో ఆమె సంతకం పెట్టేందుకు అంగీకరించలేదు. పైగా తన భర్త బైకులో వేగంగా ఎందుకు వెళతాడని పోలీసులను ప్రశ్నించినట్లు సమాచారం. ఈ విషయాన్ని ఆమె స్వయంగా జిల్లా ఎస్పీ రామకృష్ణకు ఫోన్‌ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై ఎస్పీ స్థానిక డీఎస్పీకి ఫోన్‌ చేశారు. దాంతో మళ్లీ గురుపద్మ నుంచి గురువారం సాయంత్రం పోలీసులు ఫిర్యాదు తీసుకున్నారు. కేసు నమోదులో జాప్యం కావడంతో పోస్టుమార్టం శుక్రవారానికి వాయిదా వేశారు. ఏది ఏమైనా సుబ్బిరెడ్డి మరణంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పలువురి నివాళి
స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజలకు సేవలు అందిస్తున్న సుబ్బిరెడ్డి మరణించిన విషయాన్ని తెలుసుకున్న ఆదరణ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షుడు సత్యనారాయణ తదితరులు నివాళులు అర్పించారు. స్థానిక రాజీవ్‌ సర్కిల్‌లో ఆయనకు నివాళిగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.